నిరుపేదలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన ( పీఎంయువై ) కింద వంట గ్యాస్ కనెక్షను ఉచితంగా అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు . వంట గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు అధికారులు చర్యలు ప్రారంభించారు . గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల్లో పంపిణీదారుల ద్వారా చర్యలు చేపట్టారు . ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉచితంగా ఇవ్వనున్నారు . కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తెచ్చింది . దీని కింద పెద్ద ఎత్తున రాయితీ భరించనుంది . జిల్లాలో కమిటీని కూడా దీనికోసం నియమించారు . జిల్లా సర్వోన్నతాధికారి చైర్మన్ , జిల్లా పౌరసరఫరాల అధికారి , బీపీసీఎల్ , హెచ్పీసీఎల్ , ఐవోసీఎల్ సమన్వయకర్తలు , సేల్స్ అధికారులను జిల్లా కమిటీలో సభ్యులుగా నియమించారు . రేషన్ కార్డులు ఉన్న అన్ని ప్రాంతాల్లోని పేదలకు ఈ పథకం కింద సిలిండర్లను జారీ చేయనున్నారు .
నిరుపేదలకు వరమే.... ఉమ్మడి జిల్లాలో 69 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు . కర్నూలు జిల్లాలో 6,67,456 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి . మూడేళ్ల కిందట ఉజ్వల యోజనను కేవలం ఏజెన్సీకి పరిమితం చేశారు . కానీ ప్రస్తుతం నంద్యాల , కర్నూలు జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లోని వారికివ్వనున్నారు . 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయనున్నారు . కర్నూలు జిల్లాలో పీఎం ఉజ్వల యోజన పథకం కింద ఇప్పటి వరకూ | గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు చెప్పారు . ఈ జిల్లాలో కొత్తగా 8,192 రేషన్కార్డులు ఇచ్చినట్లు తెలిపారు . వీరిలోనూ గ్యాస్ కనెక్షన్లు లేని పేద లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు .
పరిశీలించనున్న కమిటీ... ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉమ్మడి జిల్లాల్లోని గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలు గ్యాస్ పంపిణీదారులకు అందించిన దరఖాస్తులను జిల్లా కమిటీ ఛైర్మన్ , సభ్యులు పరిశీలించి కనెక్షన్లు జారీ చేయనున్నారు . కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద కనెక్షన్ తీసుకున్న ప్రతి నెలా కొనుగోలు చేసే సిలిండర్ ధరలో రూ .300 లు లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో రాయితీ కింద జమ చేస్తుంది . వంటగ్యాస్ కనెక్షన్కు సంబంధించి స్టౌవ్ , రెగ్యులేటర్ , పైపుతో పాటు సిలిండరును ఇస్తుంది .
ఇవి తప్పనిసరి ..
• ఆధార్కార్డు , రేషన్కార్డు తప్పనిసరిగా ఉండాలి .
• ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంది .
• బ్యాంకు ఖాతాతో పాటు కుల ధ్రువీకరణ పత్రాలను అందజేయాల్సి ఉంది .
• గతంలో రేషన్కార్డులో ఉన్న సభ్యుల పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు .